AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ చీటర్‌.. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదు

అభివృద్ధిని అడ్డుకున్నారు
ముస్లిం ఎజెండాతో ఏబీసీ పార్టీలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్‌

(అమ్మన్యూస్‌, పెద్దపల్లి):
తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలన అంతా అవినీతి మయమేనని, కేసీఆర్‌ చీటర్‌ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్‌ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా సోమవారం పెద్దపల్లిలో జరిగిన సభలో మాట్లాడారు. తెలంగాణాలో ప్రధాని ఆవాస్‌ యోజనను కేసీఆర్‌ అమలవ్వకుండా అడ్డుకున్నారని, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి కూడా దీన్ని అమలు చేయడం లేదని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు.

కేంద్రంలో గత కాంగ్రెస్‌ హయాంలో కూడా అంతా అవినీతి ఉండేదని, నిర్ణయాత్మక విధానాలు అమలు చేసే స్థితిలో కూడా కాంగ్రెస్‌ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అబద్ధపు వాగ్దానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, అపరాధులను రక్షించడమే కాకుండా కాంగ్రెస్‌ చేసిన అవినీతి రాజకీయం తమకు గుర్తు ఉందన్నారు. మోదీ వచ్చాక పదేళ్లలో అవినీతిని తొక్కి పెట్టి దేశాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో జేపీ నడ్డా మాట్లాడారు.

ఏ అంటే ఎంఐఎం, బీ అంటే బీఆర్‌ఎస్‌, సీ అంటే కాంగ్రెస్‌ అని.. ఈ మూడు పార్టీలు ముస్లింల ఎజెండాతో ముందుకు వెళ్లే పార్టీలని చురకలంటించారు. ఈ పార్టీలు తబ్లిగీ జమాతేను అనుసరిస్తున్నాయని.. రజాకార్‌ పాలనను సమర్థించే పార్టీలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ పార్టీలు నిర్వహించవని, కేంద్రంలో మళ్లీ బీజేపీని గెలిపిస్తే తెలంగాణ విమోచనాన్ని ధూంధాంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మోదీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్‌ గాంధీ అంటున్నారని, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు రాహుల్‌ గాంధీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కల్పించిన పార్టీ కాంగ్రెస్‌ అని, నిరుపేదలను అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని నిప్పులు చెరిగారు.

ANN TOP 10