AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బతికున్నంత కాలం బీజేపీలోనే ఉంటా.. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

‘నేను బతికున్నంత కాలం బీజేపీలోనే ఉంటా.. ప్రధాని మోదీ జపం చేస్తా..’ అని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. తాండూరులో ఆదివారం బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాచౌక్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ నోరు తెరిస్తే బీజేపీకే లాభమని అన్నారు. ఆయన బీజేపీ స్టార్‌ ప్రచారక్‌ అవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ఇటలీ పారిపోతారని రాజాసింగ్‌ అన్నారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్‌ పార్టీ సర్వనాశనం చేసిందని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌, కేటీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్‌రెడ్డి బంజారాహిల్స్‌లో హనుమాన్‌ ఆలయ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు ఆంజనేయస్వామి సైనికులుగా పనిచేయాలని కోరారు. గతంతో ఓవైసీ కుటుంబాన్ని వైఎస్సార్‌ తర్వాత కేసీఆర్‌, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఓవైసీ సోదరులను జైల్లో పెట్టించిన ఘనత కిరణ్‌ కుమార్‌రెడ్డికే దక్కిందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు ఒప్పందం ఉందని రాజాసింగ్‌ ఆరోపించారు. బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని వ్యాఖ్యానించారు.

అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి కేవలం కొడంగల్‌ సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగ్నా నదికి కొడంగల్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో తాను 3లక్షల మెజారిటీతో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బషీరాబాద్‌లో రైళ్లు ఆపిస్తానని, ఈఎ్‌సఐ ఆస్పత్రి, కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్‌, నాయకులు బాలి శివకుమార్‌, అంతారం లలిత పాల్గొన్నారు.

ANN TOP 10