AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హేమంత్ సోరెన్ అరెస్ట్.. సీఎం పదవి కోసం కుటుంబంలో కుమ్ములాటలు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో రాంచీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 7 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే అరెస్ట్‌కు ముందే జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ స్వయంగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ అధికార కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. రాజ్‌భవన్ చేరుకున్నారు. ఇక శాసనసభాపక్ష నేతగా మంత్రి చంపై సోరెన్‌ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ను కలిసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు చంపై సోరెన్ అనుమతి కోరనున్నట్లు సమాచారం.

ఇక జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా.. ఆ తర్వాత అరెస్ట్‌తో జేఎమ్ఎమ్ అధినేత శిబు సోరెన్ కుటుంబంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఇంటి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. తాను అరెస్ట్ అయితే తన భార్య కల్పనా సోరెన్‌ను సీఎం చేయాలని ఆశించిన హేమంత్ సోరెన్‌కు ఆయన వదిన రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తాను వ్యతిరేకం అని శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో సీఎం కుర్చీ కోసం శిబు సోరెన్ కుటుంబంలో ఘర్షణ తలెత్తిందనే వార్తలకు సీతా సోరెన్ కామెంట్లు బలం చేకూరుస్తున్నాయి.

సీతా సోరెన్‌ చేసిన వ్యాఖ్యలతో జార్ఖండ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాని.. ఎలాంటి రాజకీయ అనుభవం లేని కల్పన సోరెన్ సీఎంగా ఎందుకు అని సీతా సోరెన్ వ్యాఖ్యానించడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. జేఎమ్ఎమ్ పార్టీలో ఎంతో మంది సీనియర్‌ నేతలు ఉండగా కల్పనా సోరెన్ పేరునే ముఖ్యమంత్రి పదవి కోసం ఎందుకు ప్రచారం చేస్తున్నారని సీతా సోరెన్ ప్రశ్నించారు. శిబు సోరెన్ కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో తానే సీనియర్‌ను అని.. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని సీతా సోరెన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రి చేయాలనే ఎలాంటి నిర్ణయంపైన అయినా తాను గట్టిగా నిరసన వ్యక్తం చేస్తాని దుర్గా సోరెన్‌ భార్య, ప్రస్తుత ఎమ్మెల్యే సీతా సోరెన్‌ తేల్చి చెప్పారు.

ANN TOP 10