ఆంధ్రప్రదేశ్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు పూర్తికాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, చాలా చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం పట్టణం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరిపై ఎంతో బాధ్యత ఉందని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమను ఎన్నుకున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కౌన్సిల్ సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. పార్టీ భేదాలు, తారతమ్యాలు పక్కనపెట్టి అన్ని వార్డుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.








