ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు డబ్బు, బహుమతులు, ఇతర ప్రలోభాలతో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటు విలువను చాటుతూ రాజమండ్రిలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల వేళ ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే సందేశాన్ని ఈ ఫ్లెక్సీ ద్వారా చాటుతున్నారు.
రాజమండ్రి 46వ వార్డుకు చెందిన నోడగల సుధా యాదవ్ తన ఇంటి గేటుకు ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు, కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫ్లెక్సీ కనిపించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆసక్తిగా చదువుతూ ఆయన నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సుధా యాదవ్.. ఓటు అనేది అమ్ముకునే వస్తువు కాదని, ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తును నిర్ణయించే హక్కు అని తెలిపారు. ప్రజల్లో ఓటు విలువపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తన ఇంటి నుంచే మార్పు ప్రారంభం కావాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.








