నిబద్దత, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సిబ్బందిలో ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
టీఎస్ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారు. హయత్ నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్బాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారు. చిల్లర విషయంలో ఒక మహిళ.. గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు.. ఆయన సెల్ ఫోన్ లాక్కుని అసభ్యపదజాలంతో మరొక మహిళ దూషించారు. పికెట్ డిపోనకు చెందిన మహిళా కండక్టర్ పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలు సాముహికంగా దాడి చేశారు. పై మూడు ఘటనలపై రాచకొండ కమిషనరేట్ లోని సంబంధిత పోలీస్ స్టేషన్ లలో టీఎస్ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ కేసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
టీఎస్ఆర్టీసీ నియమావళి ప్రకారమే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నిబంధనల మేరకే టికెట్ల జారీ ప్రక్రియను కండక్టర్లు కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు ఒక వేళ టికెట్ తీసుకోకుంటే.. అది చెకింగ్ లో గుర్తిస్తే ఆ సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో విధిగా టికెట్ తీసుకుని సిబ్బందిని సహకరించాలని టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.









