AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ప్రతినిధులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశం

డిసెంబర్ 7 నుంచి నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఫార్చ్యూన్ కంపెనీల పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమ్మిట్‌కు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతినిధులకు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రవేశం కల్పించాలని, విధుల్లో ఉండే అధికారులు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ప్రతినిధుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు మెరుగైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని సీఎం పేర్కొన్నారు. అలాగే ప్రతి ప్రతినిధికి అవసరమైన సహకారం అందించేందుకు లైజనింగ్ ఆఫీసర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ANN TOP 10