దొంగతనం అంటే ఇళ్లలో నగలు, డబ్బులు లేదా పొలాల్లో పంటను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఖమ్మం జిల్లాలో దొంగలు చేసిన పని ఓ రైతును తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చేతికి వచ్చిన పంటను కోసుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా మిరప తోటలోకి చొరబడి పండిన కాయలను కోసుకెళ్లారు. దీంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన గుత్తా నాగరాజు తనకున్న ఎకరం 20 కుంటల భూమిలో మిరప సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలో మొదటి విడత పంట కోతకు సిద్ధంగా ఉంది. మిరపకాయలన్నీ పండి ఎర్రగా మారడంతో మరికొద్ది రోజుల్లో కూలీలను పెట్టి పంటను కోయించాలని ఆయన భావించారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి మైసమ్మ తల్లికి పాలు పొంగించేందుకు ఉదయం పొలానికి వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత తోటలోని ఓ భాగంలో చెట్లకు మిరపకాయలు కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో తోటలోకి ప్రవేశించి పండిన మిరపకాయలను కోసుకెళ్లినట్లు గుర్తించారు. చేతికి వచ్చిన పంట దొంగల పాలవడంతో రైతు నాగరాజు కన్నీరుమున్నీరయ్యారు.








