ఏపీలో దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లుగా నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లకు తొలిసారి దాన్ని పెంచాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ ప్రకటన చేశారు. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా ప్రభుత్వం వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న దాదాపు 3 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తోంది. దీన్ని పెంచాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజలకు చేస్తున్న సేవకు గౌరవ వేతనంగా చెల్లిస్తున్న మొత్తం కాబట్టి ఇందులో ప్రతిఫలం ఆశించవద్దని వారికి గతంలోనే సూచించింది.
అయితే వీరి సేవకు ప్రతిఫలంగా ప్రతీ ఏటా వాలంటీర్లకు సేవా అవార్డుల పేరుతో ప్రభుత్వం నగదు బహుమతులు అందిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వాలంటీర్ల సేవలకు ప్రతిఫలంగా ఎంతో కొంత గౌరవ వేతనం పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం … నెలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలకు అదనంగా మరో రూ.750 చొప్పున ఇవ్వబోతోంది. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా ఈ పెంపు నిర్ణయం అమలు చేయబోతున్నట్లు మంత్రి కారుమారి నాగేశ్వరరావు ఇవాళ తిరుమలలో తెలిపారు. ఈ నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో వాలంటీర్లకు రూ.5750 గౌరవవేతనంగా అందనుంది. సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక అయిన వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా ప్రభుత్వానికి ఈ నాలుగేళ్లలో మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల్ని ఇంటింటికీ తీసుకెళ్లడం, పథకాల సొమ్మును నేరుగా లబ్దిదారులకు అందజేయడం, పథకాలు రాని వారికి ప్రభుత్వంతో చెప్పి పథకాలు ఇప్పించడం వంటి కార్యక్రమాలతో వాలంటీర్లు మంచి పేరే తెచ్చుకున్నారు. దీంతో మొదట్లో వాలంటీర్ల వ్యవస్ధపై విమర్శలు గుప్పించిన విపక్షాలు కూడా సైలెంట్ అయిపోయాయి.









