హైదరాబాద్ లో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపింది. AMR సంస్థకు చెందిన మహేశ్ రెడ్డి నుంచి రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
కర్ణాటక నుంచి డబ్బు తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక కీలక నేతకు AMR సంస్థకు చెందిన మహేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల నగదును ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు.
కోట్ల రూపాయల నగదు సీజ్..
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. అనుమతులు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బును పోలీసులు సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల భారీగా నగదు పట్టుబడింది. వ్యక్తుల వాహనాల్లో లక్షలు, కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకుంటున్నారు.
ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ డబ్బుని సీజ్ చేస్తున్నారు. అనంతరం డబ్బును ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు హెచ్చరికలు, కీలక సూచనలు చేశారు. సరైన పత్రాలు లేకుండా డబ్బును తరలించొద్దని కోరారు. డబ్బు తీసుకెళ్తున్న సమయంలో సరైన డాక్యుమెంట్స్ చూపించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.









