తాను గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందని.. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తూఫ్రాన్ పరిధిలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్‌లో ఇళ్లు, భూమి పెట్టుకుని వేరే చోటికి ఎందుకు వెళతానని అన్నారు. తాను ఇక్కడే ఉంటానని.. ఎవరూ బెంగ పెట్టుకోవద్దని వ్యాఖ్యానించారు. రాబోయే టర్మ్‌లో ప్రతి నెలలో ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయించి.. ముఖ్య కార్యకర్తలతో కలిసి అభివృద్ధిపై చర్చిస్తానని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రానికే తలమానికంగా ఉండేలా గజ్వేల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
గజ్వేల్ ఊర్లలోకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మోటర్ లేకున్నా సంపు నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన కరువు ఉండేనని.. అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుంచి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చాయని గుర్తు చేశారు. అదే నేడు తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని చెప్పారు.









