AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ‌ను పుణ్యానికి ఇవ్వ‌లేదు.. చావు నోట్లో త‌ల‌కాయ పెడితే త‌ప్ప రాష్ట్రం రాలేదు

తెలంగాణ‌ను మ‌న‌కు ఎవ‌రూ పుణ్యానికి ఇవ్వ‌లేదు.. అనేక మందిని బ‌లి తీసుకుని విద్యార్థుల‌ను చావ‌గొట్టి, అనేక మందిని బాధ‌పెట్టి, చివ‌ర‌కు నేను కూడా ఆమ‌ర‌ణ దీక్ష ప‌ట్టి చావు నోట్లో త‌ల‌కాయ పెడితే త‌ప్ప తెలంగాణ రాలేదు అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎవ‌డో ఇవ్వ‌లేదు మ‌న‌కు.. పుణ్యానికి ఇచ్చిపోలేదు మ‌న‌కు తెలంగాణ‌ను అని కేసీఆర్ పేర్కొన్నారు. జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కృష్ణా జ‌లాల్లో మ‌న హ‌క్కు రావాల‌ని ప‌రిశోధ‌న చేశామ‌ని కేసీఆర్ తెలిపారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు, ఇక్క‌డున్న కాంగ్రెస్ ద‌ద్ద‌మ్మ ఎమ్మెల్యేలు.. వారికి నోరు లేక, అడ‌గ‌లేక జూరాల నుంచి నీళ్లు తీసుకోమ‌ని ఇచ్చారు. జూరాల బెత్త‌డు ప్రాజెక్టు. దాంట్ల నీళ్లు ఉండేదే 9 టీఎంసీలు. మ‌నం తీసుకునేది 2 టీఎంసీలు ఒక దినానికి. అలా తీసుకుంటే మూడు రోజుల‌కు ఖ‌తం అయిపోత‌ది. మ‌ళ్లా నీళ్లు ఎక్క‌డ్నుంచి తీసుకోవాలి. మ‌ళ్లా ఒక్క‌సారి గోల్ మాల్ చేయ‌డానికి ఆంధ్రా ముఖ్య‌మంత్రులు జూరాల నుంచి సోర్స్‌ అని పెట్టారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటం.. నాకర్థం కాదు అని ప్ర‌శ్నించాను. శ్రీశైలం వాని అయ్య జాగీరా..? దాంట్ల మ‌న పైస‌లు లేవా..? బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాల‌ని చెప్పి.. నేను అధికారులంద‌రికీ చెప్పి పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం యొక్క సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చాం. ఇప్పుడున్న కాంగ్రెస్ నేత‌లకు తెలివి లేదు. ఈ జిల్లాలో ఎట్ట పుట్టారో కూడా తెల్వ‌దు. వాళ్లు మాట్లాడుతారు ఇప్పుడు కూడా.. జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే అని.. సిగ్గుప‌డాలి.. మీకు ఏమ‌న్నా తెలివి ఉన్న‌దా..? జూరాల‌లో నీళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసా.? ఎన్ని రోజుల‌కు వ‌స్తాయో తెలుసా..? అంటే ఆ రోజు భావదారిద్ర‌మే.. ఉద్య‌మం చేస్తుంటే భావదారిద్ర‌మే.. ఇవాళ కూడా అదే భావదారిద్ర‌మే అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

క‌రువు అనేది మ‌న‌దిక్కు క‌న్నెత్తి కూడా చూడ‌దు..
మ‌నం పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రారంభించుకున్నాం.. దానికి మ‌ళ్లా ఎవ‌డు అడ్డం.. ఇదే జిల్లాలో పుట్టిన ద‌రిద్రులు, కాంగ్రెస్ నాయ‌కులు పోయి కేసులు వేస్త‌రని కేసీఆర్ మండిప‌డ్డారు. అది కావొద్దు.. అది అయితే ల‌క్ష్మారెడ్డికి, శ్రీనివాస్ గౌడ్‌కు పేరు వ‌స్త‌ది. కేసీఆర్‌కు పేరు వ‌స్త‌ద‌ని అడ్డు ప‌డుతున్నారు. మొండిప‌ట్టుతో పోయాం. ఈ మ‌ధ్య‌నే.. 9 సంవ‌త్స‌రాల పోరాటం త‌ర్వాత అనుమ‌తులు వ‌స్తున్నాయి. ధ‌ర్మం గెలుస్త‌ది. న్యాయం గెలుస్త‌ది. నార్లాపూర్, ఏదుల‌, వ‌ట్టెం, క‌రివెన‌, ఉద్ధండ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్లు పూర్త‌య్యాయి. మోటార్లు బిగిస్తున్నారు. మూడు నాలుగు నెల‌ల్లో నీళ్లు చూడ‌బోతున్నాం. పాల‌మూరు క‌రువు పోత‌ది. ఉద్ధండ‌పూర్ పూర్త‌యితే.. జ‌డ్చ‌ర్ల స‌స్య‌శ్యామ‌లం అవుతుంది. జ‌డ్చ‌ర్ల‌లో ల‌క్షా 50 వేల ఎక‌రాల‌కు నీళ్లు వ‌స్తాయి. క‌రువు అనేది మ‌న‌దిక్కు క‌న్నెత్తి కూడా చూడ‌దు. స‌స్య‌శ్యామ‌లం కాబోతుంది అని కేసీఆర్ తెలిపారు.

ANN TOP 10