అసమాన సమూహాల మధ్య, భిన్న మనస్తత్వాల మనుషుల మధ్య సామరస్యం, వైవిధ్యం, సృష్టి ధర్మం బోధించే పండుగ బతుకమ్మ. ఇది వారసత్వం. తెలంగాణ ప్రజల జీవితాల్లో విడదీయని భాగమైపోయింది. అందుకే పదిరోజుల పాటు, బతుకమ్మ పాటలను గుండెలకు హత్తుకుంటూ, గొంతులకు తీపిదనాన్ని అందిస్తూ, గతించిన తెలుపు నలుపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రంగురంగుల పూల మయం చేసే పండుగనే బతుకమ్మ. పల్లె, పట్టణం, ఊరూ వాడా, వీధి, గుడి, బడి అంతటా పండుగ వాతావరణమే.. అంతా పూలమయమైపోతోంది.
అంతటి ప్రాశస్త్యం ఉన్న బతుకమ్మ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇవాళ బోధన్‌లో బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ముస్లిం మహిళలతో కవిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ట్వీట్ చేశారు. సంప్రదాయ, సామరస్యం, ఇదే మన తెలంగాణ అని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బతుకమ్మను పేర్చుతూ.. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అనే పాటను కవిత ఆలపించారు.









