AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

నేటి నుంచి తిరుమలలో జరిగే కార్యక్రమాలివే..
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతిమూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. కన్యామాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజ మాసంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమోక్తంగా ఈ అంకురార్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం సేనాధిపతిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణగా పిలుస్తారు.

వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల పర్యవేక్షణలో కంకణభట్టాచార్యులు కె.ఎస్‌.వాసుదేవభట్టాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు వైభవంగా నిర్వహించారు. విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ ఏర్పాట్ల‌ను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.

ఈ నెల 23న జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. మొదటి రోజు అక్టోబర్ 15న ఉదయం బంగారు తిర్చుచ్చి.. రాత్రి పెద్దశేషవాహన సేవ, అక్టోబర్ 16న ఉదయం చిన్నశేషవాహన సేవ, రాత్రి హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు.

అక్టోబర్ 17న ఉదయం సింహ వాహన సేవ, రాత్రి ముత్యపుపందిరి వాహన సేవ, అక్టోబర్ 18న ఉదయం కల్పవృక్ష వాహన సేవ,రాత్రికి సర్వభూపాల వాహన సేవ ఉంటాయి. అక్టోబర్ 19న ఉదయం మోహినీ అవతారం, అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ.. అక్టోబర్ 20న ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రికి పుష్పకవిమాన సేవ ఉంటాయి. అక్టోబర్ 21న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ.. అక్టోబర్ 22న ఉదయం స్వర్ణరథం, రాత్రికి అశ్వవాహన సేవలు ఉంటాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.

ANN TOP 10