వైఎస్సార్ సీపీ నేతల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు జగన్ అంటే కోపం లేదని..ప్రభుత్వ విధానాలపైనే తనకు ద్వేషమని..నాయకులు చేసిన తప్పులే ప్రజలపై ప్రభావం చూపిస్తాయని పవన్ అన్నారు.
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇక వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దీనిపై వైసీపీ నేతలు ఎదురు దాడులకు దిగారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మరోసారి వాలంటీర్ వ్యవస్థపై, ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయని..వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల వద్ద ఉందని..ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారు. అమ్మాయిల అదృశ్యంపై వైకాపా నేతలు ఎందుకు స్పందించరని పవన్ మండిపడ్డారు. ఈ విషయాన్ని పక్క దోవ పట్టించేందుకే తనపై విమర్శలకు దిగుతున్నారని.. ఏలూరు రాజకీయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని..అందుకే నిలబడ్డానని ఆ నియోజకవర్గ నేతలు, వీరమహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. నిన్న ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ (AP Women Comission) నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.









