పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కుడి కంటి చూపు 85 శాతం మేర దెబ్బతిన్నట్లు, ప్రస్తుతం కేవలం 15 శాతం చూపు మాత్రమే మిగిలి ఉందని కోర్టు నియమించిన అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) బారిస్టర్ సల్మాన్ సఫ్దార్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. అక్టోబర్ 2025 వరకు 6/6 (సాధారణ) చూపుతో ఉన్న ఇమ్రాన్, జైలు అధికారుల నిర్లక్ష్యం మరియు సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్లే ఈ పరిస్థితికి చేరుకున్నారని నివేదిక స్పష్టం చేసింది.
మెడికల్ రిపోర్టుల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ‘రైట్ సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూజన్’ (కంటిలో రక్తం గడ్డకట్టడం) అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆయన కుడి కంటి చూపు దాదాపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ నివేదికను పరిశీలించిన పాక్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యాహ్యా అఫ్రిది నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఖైదీల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేస్తూ, ఫిబ్రవరి 16వ తేదీ లోగా నిపుణులైన నేత్ర వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
అంతేకాకుండా, ఇమ్రాన్ ఖాన్‌కు తన వ్యక్తిగత వైద్యులతో చికిత్స పొందేందుకు అనుమతించాలని, లండన్‌లో ఉన్న తన కుమారులతో ఫోన్లో మాట్లాడేందుకు వీలు కల్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, ఇదే వైద్య కారణాలను చూపుతూ తనకు విధించిన శిక్షను నిలిపివేసి, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ శనివారం ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 73 ఏళ్ల వయసులో, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధంలో ఉండటం వల్ల ఆయన మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.








