కేదార్నాథ్లో చోటు చేసుకున్న ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాంకు చెందిన జర్జాన రవిరావు (29) దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్య కళ్యాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి 5 నెలల కిందటే పెళ్లి జరిగింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన రవిరావుకు, రాజాం పట్టణం సారథికి చెందిన కళ్యాణితో ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. రవిరావు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. దంపతులిద్దరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వారం రోజుల కిందట ఈ జంట కేథారినాథ్ యాత్రకు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లింది. కొత్త జంట అక్కడ సరదాగా గడుపుతున్న వేళ యాత్రలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
శనివారం రాత్రి ఉత్తరాఖండ్లో భారీ వర్షం కురిసింది. భారీ వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో రవిరావు, కళ్యాణి దంపతులతో పాటు పలువురు యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ఉన్నారు. గంగానది ప్రవాహంలో ప్రయాణికులంతా గల్లంతయ్యారని భావించారు. అయితే, రెస్క్యూ టీం కళ్యాణితో పాటు మరి కొంత మంది యాత్రికులను బయటకు తీసుకొచ్చింది.
తీవ్రంగా గాయపడిన కళ్యాణిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రవిరావు మృతదేహం లభ్యమైంది. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఉత్తరాఖండ్ అధికారుల నుంచి సోమవారం ఈ వార్త అందిన సమయంలో.. రవిరావు కుటుంబ సభ్యులంతా తగరపువలసలో జరుగుతున్న బాలసారె కార్యక్రమంలో బంధువులతో కలిసి సంతోషంగా ఉన్నారు. రవిరావు మృతి విషయం తెలుసుకొని వారంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.









