తెలంగాణ టీడీపీ నేతలతో నేడు చంద్రబాబు కీలక భేటీ నిర్వహించనున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్ రానున్న బాబు.. ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడంతో పాటు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 3వ తేదీన ఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కావడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని పొత్తులపై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించినట్లు ప్రచారం నడుస్తోంది.
తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో టీటీడీపీ నేతలకు పొత్తులపై బాబు క్లారిటీ ఇచ్చే అవకాశముందని, అందుకే అమిత్ షాతో భేటీ తర్వాత రాష్ట్ర నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. పొత్తులపై నేడు చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని, అందులో ఎలాంటి అనుమానం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేస్తారనే టీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.









