AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎటుచూసినా తెగిపడిన కాళ్లూ.. చేతులు..

ఘటనా స్థలిలో భీతావాహ పరిస్థితి
కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఒక గూడ్సు ఢీకొట్టిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రమాదంలో 1000 మందికిపైగా గాయపడగా.. వీరిలో 400 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా వారు చేస్తున్న ఆర్తనాదాలు.. చెల్లాచెదురుగా పడిన బోగీలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

వారిని ఆ బోగీల నుంచి తీసి ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. ఫలితంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు మాట్లాడుతూ.. ఇది ఘోరమైన ప్రమాదమని, ఎస్ 3 బోగీలో మేము ప్రయాణిస్తున్నామని చెప్పారు. బోగి నుంచి బయటకు వచ్చి చూస్తే ముందున్న స్లీపర్‌, జనరల్‌ బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. అక్కడి వాతావరణం చూస్తే భయానకంగా ఉందని చెప్పారు.

కోరమాండల్ రైలులో వస్తోన్న ఏలూరుకు చెందిన ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. షాలిమార్‌‌ నుంచి వస్తున్నామని, బీ8 కోచ్‌లో ఉన్నామని తెలిపారు. ‘30 సెకండ్ల పాటు బోగీలు కుదుపులకు లోనయ్యాయి. మేమంతా తీవ్ర ఆందోళన చెంది కిందికి దిగి చూస్తే మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లో అంబులెన్సులు వచ్చాయి. మేం ప్రమాద స్థలం నుంచి కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లి.. అక్కడ నుంచి బస్సులో భువనేశ్వర్‌‌కు చేరుకున్నామని తెలిపారు.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు-హౌరా రైలు ఏది తొలుత పట్టాలు తప్పి ప్రమాదానికి గురైందనే విషయంపై రెండు రకాల కథనాలు వినిపించాయి. తొలుత కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్సేనంటూ స్థానిక అధికారులు తెలిపారు. కానీ, మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికార ప్రతినిధి అమితాభ్‌ శర్మ స్పష్టం చేశారు.

ANN TOP 10