ఎంతటి నిర్లక్షం ఇది. రోడ్డుపై కారు ఆపాడు. వెనక వస్తున్న వాహనాలకు కనీసం గమనించకుండా డోర్ తీసి దిగబోయాడు. దీంతో వెనుక నుంచి బైక్‌పై తమ పాపతో ప్రయాణిస్తున్న శశిరేఖ – సయ్యద్ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. కారు డోర్ తగలడంతో తల్లీబిడ్డ కిందపడ్డారు. తీవ్ర గాయాలు అవ్వడంతో చిన్నారి ధనలక్ష్మి (2) మృతి చెందింది. తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. కాస్త డ్రైవింగ్ వస్తే చాలు.. డ్రైవర్ సీట్లోకి ఎక్కేస్తారు. మినిమం కామన్ సెన్స్ ఉండదు. ఇప్పుడు పోయిన నిండు ప్రాణానికి బాధ్యత ఎవరిది..? ఆ తల్లి గర్భశోకానికి కారణం ఎవరు..? అసలు ఆ తల్లి అయినా క్షేమంగా ఇంటికి వస్తుందా..? ఓ చిన్న కుటుంబం సెకన్ల వ్యవధిలో ఇంత పెద్ద విషాదానికి గురి కావడం ఆ కార్ డ్రైవర్ చేసిన తప్పు కాదా..? ఘటనా తాలూకా దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై భగ్గమంటున్నారు నెటిజన్స్. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









