తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పదవ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ కోసం వివిధ దశల్లో సాగిన పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును సిఎం గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కున్న కష్టాలను, అవమానాలను, అధిగమించిన అడ్డంకులను, సిఎం కెసిఆర్ యాది చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వేలాది సభలను నిర్వహిస్తూ, సబ్బండ వృత్తులను సకల జనులను సమీకరిస్తూ, సమన్వయ పరుస్తూ, అందరి భాగస్వామ్యం సహకారంతో, శాంతియుత పద్దతిలో పోరాటాన్ని కొనసాగించి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, ఈ క్రమంలో సహకరించిన వారినందరినీ సిఎం గుర్తు చేసుకున్నారు. విజయతీరాలకు చేరుకున్న ఈ మొత్తం ఉద్యమ ప్రస్థానంలో ఇమిడివున్న.. నిర్థిష్ట పరిస్థితులకు అనుసరించిన నిర్థిష్ట కార్యాచరణను, ‘బోధించు సమీకరించు పోరాడు’ అనే పంథా ద్వారా సాధించిన విజయాన్ని సిఎం కెసిఆర్ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా స్మరించుకున్నారు.









