బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరి తలపై రూ.లక్షన్నర అప్పు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన షర్మిల.. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు షర్మిల 10 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. ‘అవినీతి సొమ్మంతా సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. ప్రజలకిచ్చిన అన్ని హామీలను సీఎం తుంగలో తొక్కారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నా పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తానని కొందరు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఓ మహిళ కష్టాన్ని అవమానించొద్దు. అభ్యర్థులను తయారు చేసుకుని ఎన్నికల్లో పోటీకి నిలబెడతా. బీఆర్ఎస్ తో మేం ఎప్పటికీ పొత్తు పెట్టుకోం. పొత్తులపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా స్పష్టత ఇవ్వాలి. అప్పట్లో నేను చేరతానంటే కాదనే పార్టీ ఏదైనా ఉందా? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని కాంగ్రెస్ స్పష్టం చేయాలి’ అని షర్మిల పేర్కొన్నారు.









