ఏపీ బీఆర్‌ఎస్ కార్యాలయం ఓపెన్ చేసి 24 గంటలు కూడా గడవకముందే..
గుంటూరులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రాష్ట్ర కార్యాలయాన్ని మే 21 ఆదివారం రోజున గ్రాండ్‌గా ప్రారంభించారు. అయితే ఆఫీసు ఓపెన్ చేసి 24 గంటలైనా గడవకముందే రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ బోర్డులను చింపి, పార్టీ జెండాలను తొలగించారు. దాడిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఆదివారం ఉదయం 11.35 గంటలకు గుంటూరులోని మంగళగిరి రోడ్డులోని ఏఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఐదంతస్తుల భవనంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ ఆచితూచి మాట్లాడారు. కేవలం కేసీఆర్ గొప్పతనాన్ని ప్రస్తావించి.. ఆయనకు పీఎం అయ్యే యోగ్యత ఉందని చెప్పారే.. తప్ప ఏపీలోని ప్రధాన పార్టీలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయినప్పటికీ దుండగులు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి లభిస్తున్న స్పందనను జీర్ణించుకోలేక ప్రత్యర్థి పార్టీల సభ్యులు ఇలాంటి దాడికి పాల్పడి ఉంటారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.









