నల్లటి రోడ్లు వేసి, మిణుకు లైట్లు ఏర్పాటు చేసి ఇదే అభివృద్ధి అనుకుంటే ప్రజలు దీవించరు.. మనుషులను గౌరవించాలి.. రాజ్యమెప్పుడూ మీ చేతుల్లో ఉండదు… ప్రజాదీవెన ముందు ఎంతటి వారైనా ఇంటికి పోయే రోజున పోవాల్సిందే..’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నుఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపాన ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంలో ఏర్పాటు చేయగా భారీ సంఖ్యలో పొంగులేటి అనుచరులు, అభిమానులు తరలివచ్చారు. శ్రీనివాసరెడ్డితో పాటు ఈ సమ్మేళనానికి అతిథులుగా హాజరైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను అభిమానులు సన్మానించారు. అనంతరం సమ్మేళనాన్ని ఉద్దేశించి పాంగులేటి మాట్లాడుతూ.. మంత్రి అనుచరులు ఖమ్మంలో మట్టి కొండలనూ వదలడం లేదని, ప్లాట్లను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.
ప్లాట్లను ఆక్రమిస్తే స్వయంగా ఆ పార్టీ కార్పొరేటరే బాధితుల తరఫున నిరసన తెలిపారని గుర్తుచేశారు. తన, పర బేధం లేకుండా సామాన్యులను ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురిచేసేలా అనుచరులను ఉసిగొల్పడమే మంత్రి అజెండా అని ఆరోపించారు.
ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలోని పోలీసు, రెవెన్యూ వ్యవస్థ మొత్తం తన కంట్రోల్లో ఉన్నట్లు మంత్రి భావిస్తున్నారని, ఇది పటాపంచలయ్యే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. అధికారం ఎవరి సొత్తు, శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తించి ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. ప్రజల ఆత్మాభిమానం, తీర్పు ముందు ఎంతటి పెద్దవారైన తలవంచక తప్పదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇది వర్తిస్తుందని పొంగులేటి తెలిపారు.









