కేసీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్‌గా అమలవుతోందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… దోపిడీలో వాటా లేకపోతే కేసీఆర్‌పై(KCR) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డిలు (Kishan Reddy) చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రంకెలెయ్యడం కాదు… 111 జీవో రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలన్నారు.
బందిపోట్లనైనా క్షమించవచ్చు కానీ… కేసీఆర్, కేటీఆర్‌ను క్షమించలేమన్నారు. 111జీవో రద్దుపై కాంగ్రెస్ పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటి వరకు భూ కేటాయింపులు జరగలేదని, తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించామని గుర్తుచేశారు. 5100 గజాల కోసం పైసలు కట్టామని… కానీ భూ కేటాయింపు జరగలేదన్నారు. అందుకే ఇప్పటికీ కిరాయికి ఉంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ తన పార్టీ ఆఫీసుకి 11 ఎకరాలు కేటాయించుకోడం దుర్మార్గమని మండిపడ్డారు. తమ కార్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.









