కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల వేగం పెంచింది. రాష్ట్రంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటికి ఏఐసీసీ అగ్రనాయకులు హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మలిసభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ఆమె సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఆమె తొలి సభ ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ సభలో యూత్ డిక్లరేషన్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రియాంక మలి సభను మెదక్ జిల్లాలో నిర్వహించేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వరుస కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.









