35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) అన్నారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరుగిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగు చేయడంతో పాటు శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారన్నారు.
దీంతో పోలీస్‌స్టేషన్ల పెంపుదల, జోన్ల రూపుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు. 6 నెలల పాటు రీ ఆర్గనైజేషన్ కమిటీ కూర్చుని కొత్త పోలీస్‌స్టేషన్లకు ప్రతిపాదన చేసిందని అన్నారు. 35 ఏళ్ల కింద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 లక్షల మంది జనాభా ఉండేవారని… ఇప్పుడు 85 లక్షలకు పెరిగిందన్నారు. 1987లో 8,76,126 వాహనాలు ఉంటే ఇప్పుడు 80,70,852 వాహనాలు పెరిగాయని సీపీ చెప్పారు.









