హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్ ఎస్.పి.ఆర్ హిల్స్ లో రూ.1785 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీలు సురబీ వాణిదేవి, మిర్జా రహమత్ బేగ్, రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… 58 జీవో ప్రకారం పేదవారి ఇల్లు రెగ్యులరైజ్ చేసినం.. పెన్షన్‌లు ఇస్తున్నాం, డబల్ బెడ్ రూంలు కట్టి ఇస్తున్నాం, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించామన్నారు. ఇవి పప్పు, బెల్లంలాగా ఎవరికి పడితే వారికి పంచడానికి ఉండదని తెలిపారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర అయ్యేదని.. ఇప్పుడు ఒక్కో డబల్ బెడ్ రూం ఇల్లు నిర్మించడానికి 9 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ చాలా మాట్లాడుతున్నారని… కానీ పేదల కోసం ఏమీ చేయరని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇస్తామని.. ఎవరు భయపడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.









