కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రైవేటు వర్శిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీల్లో 4 వేల మందికి అడ్మిషన్లు ఎలా ఇస్తారని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందన్నారు. దళితులను తిట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే అని పట్టుబట్టారు. అంబేద్కర్ లేకుంటే ఆయనది బిచ్చపు బతుకయ్యేదనే సంగతి తెలుసుకుంటే మంచిది అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రమోషన్లకు అమ్ముడుపోయిన కొందరు పోలీసులు ఏబీవీపీ నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేస్తే తమకొచ్చిన నొప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీపీవీ రాష్ట్ర కార్యదర్శి ఝూన్సీపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా అని మండిపడ్డారు. తక్షణమే ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ తమ పార్టీ నాయకుడని… జాతీయ నాయకత్వాన్ని కలవడానికి వెళితే తప్పేందని ప్రశ్నించారు.









