కోడలు, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి
భార్య మరణాన్ని తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య చేసుకోగా… ఆ కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయిన తల్లి గుండెపోటుతో చనిపోయింది. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం అందర్నీ విషాదంలో ముంచేసింది. వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ… కరీంనగర్ జిల్లా… తిమ్మాపూర్ మండలం… నేదునూర్‌కు చెందిన 35 ఏళ్ల శ్యాంసుందర్.. జానపద గాయకుడు. హుస్నాబాద్‌లోని గోదాంగడ్డ కాలనీలో నివసించిన శారదతో సంవత్సరం కిందట పెళ్లైంది.
భార్యాభర్తలుగా ఇద్దరూ 4 నెలలు అన్యోన్యంగా ఉన్నారు. ఐతే.. వాళ్ల మధ్య ఏం జరిగిందో ఏమో గానీ… పుట్టింటికి వెళ్లిన శారద 2022 సెప్టెంబరు 20న ఇంటి ముందు ఉన్న చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెళ్లైన 4 నెలలకే ఆమె ఎందుకిలా చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. భర్త చూస్తే.. తమ మధ్య ఏ గొడవా జరగలేదని తెలిపాడు.
ఆమె మరణానికి కారణం శ్యాంసుదరే అని కొంత మంది ఆరోపించారు. కానీ శ్యాంసుందర్ చాలా ఆవేదన చెందాడు. ఆమె లేకుండా బతకలేకపోతున్నానని తరచూ తన వాళ్లతో చెప్పేవాడు. వాళ్లు అతనికి ధైర్యం చెప్పి… అంతా సర్దుకుంటుంది అనేవారు.
తాజాగా మే 15న పెళ్లిరోజు రానుండటంతో… శారదను గుర్తుచేసుకున్న శ్యాంసుందర్… భరించలేకపోయాడు. ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ… కుమిలిపోతూ.. మే 14 రాత్రివేళ.. భార్య ఉరివేసుకున్న చెట్టు కిందే పురుగుల మందు తాగి చనిపోయాడు. తెల్లారి అత్తారింటి వారు, స్థానికులూ విషయం తెలుసుకొని ఆవేదన చెందారు.
శ్యాంసుందర్ మృతిపై కేసు రాసిన పోలీసులు.. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిన్న సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా.. కొడుకు మరణాన్ని గుర్తుచేసుకుంటూ… అతని తల్లి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా… గుండె పోటుతో చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.









