భార్య చీరతోనే ఉరి వేసుకున్నాడు..
తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలతో అన్యోన్యంగా సాగుతుంది వారి కాపురం. కానీ విధికి ఆ చింతలేని కుటుంబాన్ని చూసి కన్నుకుట్టింది. అనారోగ్యంతో ఆ ఇల్లాలు కన్నుమూసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక.. భార్య 21వ రోజు కార్యక్రమం నాడు భర్త కూడా ఆత్మహత్య చేసుకుని లోకాన్ని వీడాడు. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో వెలుగుచూసింది.
మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ మారేడుపల్లి పికెట్ గాంధీకాలనీకి చెందిన 24 ఏళ్ల దాసరి అఖిల్ మియాపూర్‌కు చెందిన మౌనికను 2019లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ దంపతులకు రెండున్నరేళ్ల ప్రణవ్, సంవత్సరం వయస్సున్న హారిక సంతానం. అయితే అనారోగ్య సమస్యలతో ఏప్రిల్ 23న మౌనిక మరణించారు. దీంతో అఖిల్ తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యాడు. ప్రేమించి పెళ్లాడిన అర్ధాంగి ఇక తనతో లేదన్న చేదు నిజాన్ని భరించలేకపోయాడు.
శనివారం మధ్యాహ్నం మౌనిక 21వ రోజు కార్యక్రమ తంతు పూజ పనుల్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. పూజలో కూర్చునేందుకు రావాలని అఖిల్‌ను అతడి తల్లి రేణుక పిలిచారు. స్నానం చేసి 10 నిమిషాల్లో వస్తానని చెప్పి తన రూమ్‌లోకి వెళ్లిన అఖిల్ ఎంతసేపటికీ బయటకు రాలేదు. కంగారు పడిన తల్లి చుట్టాల సాయంతో డోర్లు బద్దలుకొట్టగా.. భార్య చీరతో అఖిల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. దీంతో కుటుంబ సభ్యుల షాక్‌కు గురయ్యారు. వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తలరించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 21 రోజుల వ్యవధిలో అమ్మానాన్నలు చనిపోవడంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో చూస్తున్న పిల్లలను చూసి స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.









