జైనథ్ మండలంలో కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి ఆదిలాబాద్ వెళ్లిన కంది శ్రీనివాస రెడ్డి.. జైనథ్ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానికులతో మమేకమయ్యారు. ఆదిలాబాద్ పాలకుల వైఫల్యాలను వారికి వివరించారు.
ఎమ్మెల్యే జోగురామన్న దాదాపు 15ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదని.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మర్చిపోయారని..బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వలేదని.. పోడు భూములకు పట్టాలివ్వలేదని అన్నారు.అర్హులకు దళిత బంధు ఇవ్వలేదని.. దళిత బంధులో కమిషన్ ల పేరిట లక్షల రూపాయలు వెనకెసుకున్నారని తెలిపారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, ఎమ్మెల్యే జోగురామన్న ఇద్దరూ ఒకటేనని.. శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటేనని, వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ లో భూములను కబ్జా చేయడం, ప్రజలను దోచుకోవడమే వారి పని అని ఎద్దేవ చేశారు.
తను రాకముందు జోగురామన్నను ప్రశ్నించేవారు లేక వారి ఇష్టారాజ్యం నడిచిందని.. ఇప్పుడు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. తనపై, తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి.. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిపించి రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. కానీ ఎవరెన్ని చేసినా తాను బెదరనని, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కంది శ్రీనివాస రెడ్డి కాదని తెలిపారు.
ఆదిలాబాద్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఎమ్మెల్యే జోగురామన్నను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.జోగురామన్నకు ఓటేసినా.. ఆయన కోవర్టు పాయల్ శంకర్ కు ఓటేసినా ఒకటేనని.. వారితో అభివృద్ధి సాధ్యపడదని తెలిపారు. కేవలం కాంగ్రెస్ తోనే ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుందని.. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనను గెలిపించి కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తనకు అవకాశమిస్తే ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తానని,పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ రూపురేఖలు మారుస్తానని హామి ఇచ్చారు.









