ఆర్మీ అధికారికి ఇమ్రాన్ కౌంటర్
అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్టైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఆయనకు రెండు వారాల బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలై శనివారం ఇంటికి చేరుకున్నారు. మూడు వేర్వేరు కేసుల్లో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవినీతి నిరోధక సంఘం కస్టడీ నుంచి విడుదలైన తర్వాత జాతిని ఉద్దేశించి ఇమ్రాన్ తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్బంగా సైన్యంపై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని పూర్తిగా గందరగోళంలో పడేయకుండా సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి రాజకీయాల్లోకి రావాలని ఎద్దేవా చేశారు. తన పార్టీని నాశనం చేయడానికి సైన్యం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
సైన్యం చర్యలు ఇప్పటికే దేశాన్ని విపత్తు అంచుకు తీసుకొచ్చాయని, ఇప్పటికైనా పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యతిరేక విధానాన్ని సమీక్షించుకోవాలని సూచించారు. అలాగే, తనను కపటవేషధారి అంటూ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
‘నేను చెప్పేది వినండి డీజీ…. నేను ప్రపంచంలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించి మంచి పేరు సంపాదించినప్పుడు మీరు ఇంకా పుట్టలేదు. కపటవేషధారి అని, ఆర్మీ వ్యతిరేకి అని మాట్లాడినందుకు మీరు సిగ్గుపడాలి.. మిలిటరీ మీడియా విభాగం ఐఎస్‌పీఆర్ ఎప్పుడూ ఇలాంటి మాటలు (రాజకీయనాయకుడి గురించి) చెప్పలేదు’ ఆయన అన్నారు.









