

ఆదిలాబాద్: ఊరు ఊరంతా బోన మెత్తింది. ఇల్లూ వాకిలీ విడిచి తమ గ్రామ దేవత వద్దకు పయనమైంది. ప్రతీ ఐదేళ్ల కోసారి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఈ తంతు జరుగుతుంది. తమ గ్రామంలో పుట్టి చాందా టి లో పెరిగిన మహాలక్ష్మమ్మ వారిని గ్రామస్తులు తమ ఆడబిడ్డగా భావించి ఊరుఊరంతా బయలుదేరి వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో చాందా టీ గ్రామం జనంతో కిక్కిరిసి పోయింది. నిన్న రాత్రే ఊరు ఖాళీ చేసి అమ్మవారి చెంతకు పయనమైంది. ఇవాళ ఉదయం గ్రామస్తులు తమ ఆడబిడ్డగా భావించే అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.బంధుమిత్రులను ఇంటి ఆడబిడ్డలను పిలుచుకొని అంతా కలసి వనభోజనాలు ఆరగించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ,వ్యాపారాల్లో స్థిరపడిన ఈ గ్రామస్తులంతా హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ రాత్రి తిరిగి తమ స్వగ్రామానికి చేరుకుంటారు.









