మేఘన్-హ్యారీ రాకపై రాజకుటుంబం కీలక ప్రకటన
మరికాసేపట్లో బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3కి పట్టాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బ్రిటన్ (Britain) రాజకుటుంబంపైనే ఉంది. ఈ వేడుకకు 100 మంది దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, రాజకుటుంబంతో విభేధాల కారణంగా రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్కెల్ (Meghan Markle) ఈ పట్టాభిషేక మహోత్సవానికి వస్తారా..? రారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ (Buckingham Palace ) కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది.
‘మే 6వ తేదీన వెస్ట్‌మినిస్టర్ అబేలో జరుగుతోన్న రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ (Duke of Sussex) హాజరవుతారు. ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్‌తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు’ అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం అన్న విషయం తెలిసిందే. వారే ఈ ఆర్కీ, లిలిబెట్. రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి.
బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ (Prince Harry).. బ్రిటన్ (Britain) రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు.
ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 (Elizabeth II) గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ (Britain) తదుపరి రాజుగా ఛార్లెస్-3 (King Charles III ) బాధ్యతలు చేపట్టారు. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) మాత్రం ఈరోజు (మే 6న) జరగనుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే (Abbey Church of Westminister)లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది.









