పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. నేతన్నలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో చేనేతకు అందుతున్న ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాల గురించి కనుక్కున్నారు. మగ్గంపై చీర నేసి .. తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. మూడేళ్లుగా వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన చేనేత రంగాన్ని బ్రతికించాలని నేతన్నలు భట్టిని వేడుకున్నారు. చేనేత కార్మికులకు, కాంగ్రెస్ కు విడదీయని అనుబంధం ఉందని.. మూడు రంగుల జెండా మధ్యలో ఉన్న చరకానే దీనికి సజీవ సాక్ష్యం అని భట్టి ఉదాహరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు.. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చేనేత స్వయం ఉపాధి పెద్దఎత్తున ఉపయోగపడుతుందని, దీని ద్వారా నిరుద్యోగ సమస్యను కొంతమేరకు తగ్గించవచ్చని భట్టి చెప్పారు.ఈ సందర్భంగా భట్టి వారి నుండి యువసంఘర్షణ సభకు హాజరుకానున్న ప్రియాంక గాంధీకి బహుకరించేందుకు.. చీరలు కొనుగోలు చేశారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోచంపల్లి చీరలను కొనుగోలు చేయడం.. తమ వృత్తిని ప్రోత్సహించినట్లుగా భావిస్తున్నామని చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.









