నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Congress MP Uttam kumar reddy) వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని.. కానీ రాష్ట్రం వచ్చిన తరువాత కూడా నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందన్నారు.
గతంలో 25 లక్షలు నిరుద్యోగులు ఉంటే .. ఇప్పుడు 40 లక్షలకు చేరిందని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ (Telangana CM) ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నిరుద్యోగులకు అండగా ఉండడానికి వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వస్తే నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయన్నారు. 80వేల 39 పోస్టులు భర్తీ చేస్తానని, 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారని… కానీ ఈ ఏడాదిలో ఒక్కటి కూడా చెయ్యలేదని ఎంపీ విమర్శించారు.









