ద్రోణి, ఆవర్తనాలతో కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ఐఎండీ అంచనా ప్రకారం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుందని తెలిపారు. ఈ ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోమవారం నాటికి వాయుగుండంగా మారి ఆతర్వాత ఉత్తరదిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఈ తుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు. ప్రస్తుత సమాచారం మేర ఏపీకు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఐఎండీ సమాచారం మేర ఇతర వివరాలు తెలియజేస్తామన్నారు.
ఏది ఏమైనా అల్పపీడనం ఏర్పడనుండటంతో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు శనివారంలోగా తిరిగి రావాలని కోరారు. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.









