హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం (BRS Central Office) ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత (BRS MLC Kavitha) హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని, ప్రతి ఒక్క పౌరుడి మద్దతుతో లక్ష్యాన్ని సాధించింది.
సీఎం కేసీఆర్ నిబద్ధతను మెచ్చి ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుంది. 9 మంది లోక్‌సభ ఎంపీలతో, ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో, 105 మంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం. సీఎం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.









