ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్..
నగరంలోని నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్‌ను ఈరోజు(బుధవారం) మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభకానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎండి మనోహర్, ఎక్సైజ్ శాఖ అధికారులు చంద్రయ్య, రవీందర్ రావు, విజయ భాస్కర్‌లు మంగళవారం పరిశీలించారు. నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసేందుకు ఈ కేఫ్ సిద్ధమైంది. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందించేందుకు ఎక్సెజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా సమీపంలో దీనిని నిర్మించింది.
ఆకర్షణీయంగా సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. ఇక్కడి నుంచి సాగర్‌లో విహరించేందుకు పర్యాటకశాఖ బోటు షికారును కూడా అందుబాటులోకి తెచ్చింది. పీపుల్స్ ప్లాజా వైపు వచ్చే సందర్శకులు నీరాను సేవించడంతో పాటు పాటు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ కేఫ్‌లో మొత్తం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్ పూర్తిగా నీరా కోసం కేటాయించగా మిగతా ఆరింటిలో వివిధ రకాల ఆహార పదార్థాలను, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలను విక్రయించనున్నారు. భవనం మొదటి అంతస్థులో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలను నిర్వహించుకునేలా విందులు ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.









