ఏజెన్సీ (Agency)లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు తెగబడ్డారు. రెండేళ్లుగా చప్పుడు చేయని నక్సల్స్.. ఒక్కసారిగా చెలరేగిపోయారు. రెప్పపాటులో విరుచుకుపడి రక్తపాతం సృష్టించారు. 50 కిలోల శక్తివంతమైన మందుపాతర పేల్చి 10 మంది డీఆర్‌జీ (డిస్ర్టిక్ట్ రిజర్వ్‌డ్ గ్రూప్) జవాన్లు, డ్రైవరును హతమార్చారు.
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అందువల్ల తెలంగాణ (Telangana) సరిహద్దులోని ఏజెన్సీలోకి మావోలు చొరపడే అవకాశం ఉందనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ ఉన్నతాకారుల సమీక్ష నిర్వహించారు.
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ ప్రభాకరన్, వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ చీఫ్, ఇతర పోలీస్ ఉన్నత అధికారులతో వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో సమావేశమయ్యారు. వెంకటాపురంలో భారీగా సీఆర్పీఎఫ్ బలగాల మోహరించారు. మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడకుండా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు మోహరించడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.









