హైదరాబాద్‌లో మరో విషాదం..
సికింద్రాబాద్ కళాసిగూడలో చిన్నారి మౌనిక ఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ షోరూం సమీపంలో నివాసం ఉంటోంది. వీరికి ఆరేళ్ల కుమారుడు, కూతరు ఉన్నారు. తల్లిదండ్రులు షోరూంలో పని చేస్తుండగా.. ఉదయం డ్యూటీకి వెళ్లారు.
ఆ తర్వాత రెండో తరగతి చదువుతున్న వారి కుమారుడు వివేక్ (6) తోటి చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడుకోవటానికి బయటకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా.. సమీపంలోని ఓ గుంతలో బాల్ పడింది. దాన్ని ఓ కర్ర సాయంతో బయటకు తీసేందుకు వివేక్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి అందులో పడిపోయాడు. ఇటీవల కురిసిన వర్షానికి గుంత నిండా వర్షపు నీరు ఉండటంతో అందులో మునిగిపోయాడు. చిన్నారులు గట్టిగా కేకలు వేసినా.. ఆ ప్రాతంలో ఎవరూ లేకపోవటంతో చిన్నారి అందులో మునిగి మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే బాలుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.









