AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారీ హిమపాతం.. కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్

ప్రతికూల వాతావరణంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేత
చార్‌ధామ్ యాత్రకు ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగిస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని భారీ హిమపాతం, వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా కేదార్‌‌ఘాట్‌లో ఈ వారంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హిమాలయాల్లో భారీవర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉన్నందున రానున్న రెండు మూడు రోజుల్లో కేదార్‌నాథ్ ధామ్ సందర్శనకు వచ్చే యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ కోరారు.

ప్రస్తుతం కేదార్‌నాథ్ ధామ్‌లో విపరీతంగా మంచు కురుస్తోందని, దీంతో సోన్‌ప్రయాగ్ నుంచి ఉదయం 10.30 గంటల తర్వాత కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు ప్రయాణికులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.‘‘ప్రయాణికులందరూ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం జారీ చేసిన సూచనలు పాటించాలి’ అని సూచించారు. అటు, కేదార్‌నాథ్ సందర్శనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. భారీ హిమపాతం, వర్షం కారణంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.

కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల చుట్టూ సూచికలు ఏర్పాటు చేయాలని, రోడ్డుపై అడ్డంకులు వీలైనంత త్వరగా క్లియర్ అయ్యేలా తగిన సంఖ్యలో యంత్రాలను, కూలీలను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోరింది.

ANN TOP 10