తెలంగాణ గవర్నర్ తమిళిసై, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ గైర్హాజరు కావడంపై బీఆర్ఎస్ మంత్రులు మాటల యుద్దానికి దిగారు. ప్రగతినిరోధకులు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని.. అందుకే సచివాలయం ప్రారంభోత్సవానికి రాలేదని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన తమకు జరిగే నష్టమేమి లేదని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం..రాకపోవడం గవర్నర్ విజ్ఞతపైనే ఆధార పడి ఉంటుందని అన్నారు.ఇక్కడే గవర్నర్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. అభివృద్ధిని అభినందించే గుణం ప్రతిపక్షాలకు లేకపోవడం దురదృష్టకరమన్నారు.తెలంగాణా అభివృద్ధిని విపక్షాలు ఇష్టపడడం లేదని మండిపడ్డారు.జరుగుతున్న అభివృద్ధితో తమ అడ్రెస్ గల్లంతు అవుతుందని బెంగపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.ప్రజాక్షేత్రంలో వారికి భంగపాటు తప్పదన్నారు. తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి నూతన సచివాలయం ప్రతీక అని,చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.









