తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఏప్రిల్ 30న సుదర్శన యాగంతో సచివాలయ భవన ప్రారంభోత్సవానికి అంకురార్పణ పడనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం (Telangana Secretariat) ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు సూర్యోదయంతోనే సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల నుంచి ఒంటి గంట 30 నిమిషాల మధ్య పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీకృత కొత్త సచివాలయానికి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభిస్తారు. ఆ వెంటనే 6వ అంతస్తులోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ కొలువుదీరనున్నారు.
మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల మధ్య కాలంలో మంత్రులందరూ తమ తమ ఛాంబర్లలో కొలువుదీరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో సమావేశం ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు, అతిథులు, సందర్శకులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.









