యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి వారి విష్ణు పుష్కరణిలో స్నానమాచరించి స్వామివారి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు సమయం పడుతోంది. భక్తులు క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు.
కాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం విశేష వేడుకలకు సన్నద్ధమవుతోంది. రానున్న 25 రోజుల్లో మూడు విశేష పర్వాలకు యాదగిరికొండ వేదిక కానుంది. ఈ నెల 25న శ్రీమద్భవగవద్రామానుజాచార్యుల జయంతి, మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నృసింహ జయంత్యుత్సవాలు, మే 14వ తేదీన హనుమజ్జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. యాదగిరిక్షేత్రంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయాల్లోనూ ఈ వేడుకలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.









