మేడ్చల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. బోడుప్పల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి. మంత్రి మల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆత్మీయ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ( సుధీర్ రెడ్డి కుమారుడు)ని ఎందుకు పిలవలేదని ధ్వజమెత్తారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు పిలవటం లేదని మండిపడ్డారు. చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పిలుపు అందలేదని.., భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలన్నారు.
మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలో కూడా జరిగిందన్న సుధీర్ రెడ్డి.., ఆ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సుధీర్ రెడ్డి మాట్లాడుతుందండగానే.. ఆగ్రహానికి లోనైన మంత్రి మల్లారెడ్డి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. అది గమనించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తనే అని మంత్రి మల్లారెడ్డి తనకుతానే ప్రకటించుకోవడం ఏంటని, అధిష్టానం ఏమైనా చెప్పిందా ? అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.
అయితే గత కొంత కాలంగా మేడ్చల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి తీరును వ్యతిరేకిస్తు్న్నారు. తమన నిర్లక్ష్యం చేస్తూ మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. కొన్ని నెలల క్రితం మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశం కూడా నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. అయినా ఆయన తీరు మారటం లేదని.., తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా మరోసారి పార్టీలో వర్గవిభేదాలు బయటపడటం మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారి తీశాయి.









