AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ. 100 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాదీ!

ఇండియాలో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తారు. క్రికెట్ అభిమానులతో పాటు మరికొందరు కూడా ఐపీఎల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. వారెవరో కాదు. బెట్టింగ్ రాయుళ్లు. ఐపీఎల్ సీజన్‌లో భారీగా బెట్టింగ్ నడుస్తోంది. బాల్ బాల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. ఆ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారతాయి. బెట్టింగ్ అనేది ఓ వ్యసనం లాంటింది.

ఇలా బెట్టింగ్‌కు అలవాటు పడ్డ ఓ హైదరాబాద్ రియల్టర్ గత 12 ఏళ్లలో ఏకంగా రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ విషయాన్ని సదరు వ్యక్తే పోలీసుల ఎదుట చెప్పాడు. హైదరాబాద్ నగరంలో బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను రెండ్రోజుల క్రితం (ఈనెల 14న) పోలీసులు పట్టుకున్నారు. పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు సబ్ బుకీలతో పాటు ఓ కలెక్షన్ ఏజెంట్‌ను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టైన వారిలో అశోక్‌రెడ్డి అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్‌లో ఏకంగా రూ. 100 కోట్లు కోల్పోయినట్లు తెలిసింది. హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసముండే అశోక్ రెడ్డి.. గత కొంత కాలంగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో కలిసొచ్చే బాగానే సంపాదించాడు. అయితే అతనికి ఐపీఎల్ బెట్టింగ్‌ పెట్టడం వ్యసనంగా మారింది. తొలుత వేలల్లో బెట్టింగ్ పెట్టిన అశోక్ రెడ్డి.. కొంత సంపాదించాడు. డబ్బుపై ఆశతో లక్షల్లో బెట్టింగ్ పెట్టడం ప్రారంభించాడు. డబ్బు కోల్పోయిన ప్రతిసారి అతడు రెట్టింపు బెట్టింగ్ కాసేవాడు. ఇలా గత 12 ఏళ్లలో అశోక్ రెడ్డి ఏకంగా రూ. 100 కోట్లు నష్టపోయినట్లు పోలీసు విచారణలో వెల్లడించారు. అతడు చెప్పింది విని పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.

ANN TOP 10