పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ, తమ యుద్ధ విమానాలను ల్యాండింగ్ చేయడానికి అనుమతించాలన్న అమెరికా విజ్ఞప్తిని శ్రీలంక ప్రభుత్వం తిరస్కరించింది. మార్చి 4 నుంచి 8వ తేదీల మధ్య జిబూటిలోని బేస్ నుంచి క్షిపణి సామర్థ్యం కలిగిన రెండు విమానాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించేందుకు అనుమతి కావాలని వాషింగ్టన్ కోరింది. అయితే, ఈ అభ్యర్థనను తోసిపుచ్చినట్లు శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే శుక్రవారం పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. తాము అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థ వైఖరికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. యుద్ధంలో ఏ పక్షానికీ మద్దతు ఇవ్వబోమని, తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వేదికగా మారనివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు. ఫిబ్రవరి చివరిలో అమెరికా నుండి ఈ అభ్యర్థన వచ్చినప్పటికీ, దేశ సార్వభౌమాధికారం మరియు శాంతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్ నావికులు ప్రస్తుతం శ్రీలంకలోనే ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ‘ఐరిస్ డేనా’పై అమెరికా జలాంతర్గామి జరిపిన దాడిలో మరణించిన వారి సంఖ్య మరియు రెస్క్యూ ఆపరేషన్ వివరాలను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది. విశాఖపట్నంలో జరిగిన మిలాన్-2026 విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. శ్రీలంకలో ఉన్న ఇరాన్ నావికులను స్వదేశానికి పంపవద్దని అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు నివేదికలు వస్తున్నప్పటికీ, మానవీయ కోణంలో శ్రీలంక నేవీ వారికి రక్షణ కల్పిస్తోంది. భారత నౌకాదళం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని సహాయ సహకారాలు అందించింది.








