AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాకినాడలో అమానుషం: భార్యను నడిరోడ్డుపై పడేసి భర్త పిడిగుద్దులు.. వీడియో వైరల్

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీ. వేమవరంలో సామాన్యులు తలదించుకునేలా ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవి అనే మహిళపై ఆమె భర్త మణికంఠ నడిరోడ్డుపైనే దాడికి తెగబడ్డాడు. ఆమెను కింద పడేసి, ఒంటిపైకి ఎక్కి పిడిగుద్దులు కురిపిస్తూ, గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఈ దారుణానికి రెండో వివాహం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. మణికంఠ తన మేనకోడలిని రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, భార్య దేవి అందుకు నిరాకరించింది. ఈ విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా, తన పెళ్లికి అడ్డం వస్తావా అనే కోపంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మణికంఠ, దేవి ఇద్దరూ 2021లో ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం.

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, మహిళపై ఇంతటి పాశవిక దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ANN TOP 10